రాజకీయాలకు ఏ మాత్రం అర్హత లేని వ్యక్తి జగన్ అని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఫైర్ అయ్యారు. ప్రపంచంలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే ఏపీలో యువత అధ:పాతాలానికి పడిపోయేలా సీఎం జగన్ చేశారని మండిపడ్డారు. ఈ ఐదేండ్లలో వైసీపీ కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోయే పరిస్థితి ఉందన్నారు. సెటిల్ మెంట్లు పెరిగిపోయాయన్నారు. మెడపై కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధకరమో ఆలోచించాలన్నారు. రాజకీయాల్లో కేవలం రాజకీయ వ్యతిరేకత ఉంటుందని వ్యక్తిగత వ్యతిరేకత అనేది ఉండదన్నారు.
యువగళం-నవశకం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ఈ దేశంలో పాదయాత్రలు అనేవి కొత్తేమి కాదని అన్నారు. ప్రజా చైతన్యం కోసం దివంగత సీఎం ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా చాలా యాత్రలు జరిగియన్నారు. కానీ ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవన్నారు. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూసినట్లు విమర్శలు గుప్పించారు.
ఒక సమస్యపైన, ఒక పవిత్రమైన భావంతో పాదయాత్ర చేసినప్పుడు వీలైనంత వరకు సహాయం చేయాలన్నారు. లేదంటో ఇంట్లో కూర్చోవాలన్నారు. యువగళం వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టారన్నారు. యువగళం వాలంటీర్లు భయపడవద్దని ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా అన్ని అప్పగిస్తామన్నారు. యువగళం… జనగళంగా మారి ప్రజాగర్జనకు నాందిపలికిందన్నారు.
ప్రజల్లో ఉండే బాధ, ఆగ్రహం, అవేశం అన్నింటినీ యువగళంలో చూపించారన్నారు. ఇచ్చిన హామీల్లో కనీసం ఒకటైనా ఈ సీఎం నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. జాబ్ క్యాలెండర్ లేదన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మొత్తం యువత జీవితాలను నాశనం చేసే పరిస్థితికి జగన్ వచ్చారంటూ మండిపడ్డారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి అరాచకాలు జరగలేదన్నారు. ఒకప్పుడు విశాఖపట్టణం అంటే ఆర్థిక రాజధాని, కానీ ఇప్పుడు గంజాయి రాజధానిగా మారిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. విధ్వంస పాలనకు జగన్ నాందిపలికారన్నారు. ఒక్క ఛాన్స్ అని అన్నాడని, ఇప్పుడు రాష్ట్రం 30 ఏండ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పుడు మనమందరం కలవకపోతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోలేమన్నారు.
ఏపీ రాజధాని ఏదని ఆయన ప్రశ్నించారు. అమరావతిని సీఎం సర్వనాశనం చేశాడన్నారు. రిషికొండను బోడి కొండగా తయారు చేశాడన్నారు. అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి ఉండి ఉంటే 2020లోనే పోలవరం పూర్తి చేసే వాళ్లమన్నారు. ఇసుక, లిక్కర్ ఇలా అన్ని విషయాల్లో స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్ని ధరలు పెరిగిపోయాయన్నారు.
వ్యవసాయం నాశనం అయిందన్నారు. ఆత్మహత్యలు, అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే అడిగే పరిస్థితి లేదన్నారు. భవిష్యత్ గ్యారెంటీ మీద ఇప్పటికే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఉమ్మడి మెనిఫెస్టోను కూడా త్వరలోనే తయారు చేస్తామన్నారు.
ఎంతో మంది సీఎంలను చూశానన్నారు. కానీ జగన్ క్యారెక్టర్ ఏంటో అర్థం కావడంలేదన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ కావాలన్నారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తామంటే ఓట్లను తొలగిస్తాన్నారన్నారు. మీరు ఒక అడుగు వేస్తే తాము వంద అడుగులు వేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ముందుకు వస్తామన్నారు.