టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీం కోర్టు (Supreme Court)లో ఫైబర్ నెట్ కేసు (Fiber Net Case)కు సంబంధించి ముందస్తు బెయిల్ అంశం ఈరోజు విచారణకు రాగా.. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.. ఈ కేసును డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
మరోవైపు డిసెంబర్ 12 వరకు వరకూ చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12లోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇసుక కేసులో (Sand Case)లో కూడా ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 6న విచారణ చేపడతామని వెల్లడించింది.
వాస్తవానికి ఏపీ హైకోర్టులో (AP HighCourt) చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు అంశం పై ఈరోజు సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే విచారణ సమయంలో తమకు మరింత గడువు కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము వాదనలు పూర్తి చేశామని, సీఐడీ తరపు న్యాయవాదులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. సీఐడీ తరపున న్యాయవాదుల వాదనల కోసం డిసెంబర్ 6కు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి చంద్రబాబు కేసుల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కాగా ఇప్పటికే స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో హైకోర్టు తొలుత మధ్యంతర బెయిల్..ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే..