ఏపీలో గత కొన్ని నెలలుగా ఉత్కంఠంగా సాగుతున్న టీడీపీ (TDP), జనసేన (Janasena) సీట్ల పంపంకం కొలిక్కి వచ్చింది. ఇప్పటిదాకా ఊరిస్తూ ఉన్న సీట్ల పంపకంపై రెండు పార్టీలు తొలి అడుగు వేసాయి. టీడీపీ, జనసేన నేతల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నేడు ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ క్రమంలో ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో మొత్తం 118 స్థానలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
పొత్తులో భాగంగా మొదటి విడతలో జనసేనకు మొత్తం 24 స్థానాలు దక్కగా.. ఇందులో ఐదు అసెంబ్లీ స్థానాలకు జనసేనాని అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు చర్చల తర్వాత పేర్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఇక పవన్ ప్రకటించిన స్థానాల్లో.. నాదెండ్ల మనోహర్-తెనాలి.. లోకం మాధవి-నెల్లిమర్ల.. కొణతాల రామకృష్ణ-అనకాపల్లి.. బత్తుల బలరామ కృష్ణ- రాజానగరం.. పంతం నానాజీ- కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ-జనసేన పోటీకి సిద్ధమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన కలయిక అని అన్నారు. ఇక టీడీపీలోని కీలక నేతలందరికి ఫస్ట్ లిస్ట్‌లోనే టికెట్లు కన్ఫామ్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నారా లోకేష్ మంగళగిరి, అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా బాలకృష్ణ ఆయన సిట్టింగ్ స్థానం, టీడీపీ కంచుకోట అయిన హిందుపురం నుంచి బరిలోకి దిగనున్నారు.
మరోవైపు పొత్తులపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని.. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయని పేర్కొన్నారు. పొత్తుకు బీజేపీ (BJP) ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. వైసీపీ (YCP) విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకొన్నానని తెలిపారు.
రాష్ట్రం ఇప్పటికే చాలా వరకు నష్టపోయిందని.. అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమైనట్టు తెలిపారు. గతంలో తమ పార్టీకి పది సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదన్నారు. అయినా ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని, గెలుస్తున్నామని వెల్లడించారు. జగన్ సిద్ధం.. సిద్ధమని చావ గొడుతున్నాడని… తాము తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధించడానికి సిద్దం అవుతున్నామని తెలిపారు. ఈ రాక్షస రాజ్యాన్ని తరమికొట్టి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే తమ పొత్తుల లక్ష్యమని వివరించారు.