టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఓవైపు టీడీపీ శ్రేణులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుండగా.. ఇంకోవైపు అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ (YCP) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపే లక్ష్యంగా జగన్ (Jagan) పనిచేస్తున్నారని విమర్శించారు. ఆయన జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని సెటైర్లు వేశారు.
రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామని స్పష్టం చేశారు బాలకృష్ణ. ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. తానొస్తున్నానని తెలిపారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దామని పిలుపునిచ్చారు. ఉన్న సంస్థలు విధ్వంసం చేసిన జగన్.. యువతను గంజాయికి బానిస చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని.. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేద్దామని కోరారు.
అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అయితే.. కక్ష సాధింపులకు జగన్ బ్రాండ్ గా మారానని అన్నారు బాలకృష్ణ. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని.. చంద్రబాబును 16 రోజులైనా పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ముందుగా గుజరాత్ లో ప్రారంభించారని.. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారని వివరించారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చిందని.. అంతేకాదు, డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని గుర్తు చేశారు.
అరెస్ట్ అయిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న బాలయ్య.. ఇలాంటివి ఎన్నో చూశామన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. న్యాయ పోరాటం చేస్తామని.. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించనని అన్నారు. ‘‘జగన్ పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్ పై బయట తిరుగుతున్నారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని.. వేలమంది యువతకు ఉపాధి కల్పించారని వివరించారు. స్కిల్ కేసులో అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని అడిగారు బాలకృష్ణ.