టీడీపీ (TDP)కి చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రజల్లోకి దూసుకెళ్తున్న సమయంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల కారణంగా పార్టీనేతలంతా ప్రజా కార్యక్రమాలకు దూరం అయ్యారు.. ఎట్టకేలకు బాబు కారాగారం నుంచి బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న నేతలు ఏపీలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఆగిపోయిన పాదయాత్రలను పునః ప్రారంభిస్తున్నారు..
ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) యువగళం పాదయాత్రకు (Yuvagalam padayatra) సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్టు సమాచారం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10గంటల 19నిమిషాలకు యాత్ర కొనసాగించనున్నట్టు.. దాదాపు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుందని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు..
మరోవైపు లోకేశ్ యువగళం పాదయాత్రలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొని మద్దతు ఇస్తున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా లోకేశ్ వ్యవహరిస్తారని టీడీపీ నేతలు వెల్లడించారు. వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలపై లోకేశ్ గళమెత్తనున్నట్టు వారు తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. లోకేష్ 209 రోజుల పాదయాత్ర 2852.4 కి.మీ. సాగింది. 210వరోజు అయిన రేపు రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి..
ఇప్పటి వరకూ లోకేశ్ నిర్వహించిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నారు.. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు లోకేశ్ పాదయాత్రకు మద్దతు తెలిపే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు.. పాదయాత్ర మరింత ఉత్సాహంగా సాగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.. ఇక ఈ పాదయాత్రలో భాగంగా సామాన్య ప్రజలు, రైతులు వివిధ కుల వృత్తుల ప్రజలు, విద్యా, వ్యాపారవేత్తలను కలుస్తున్నారు లోకేశ్.. వారి సమస్యలను వింటూ రాబోయే తమ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు..