తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) హీట్ పెరిగింది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఆయా పార్టీలు ఎలాగైనా గెలవాలని, వచ్చే నెలలో ఎలాగైనా అధికారాన్ని చేజెక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూట్యూబ్ వేదిక ఓ ఛానల్‌ను నడిపిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న(Teenmaar mallanna) అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు టీ కాంగ్రెస్ ట్విట్టర్ (x) ఖాతా ద్వారా ప్రకటించింది. ఇదివరకే పలువురు రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఐసీసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్‌ల ఆధ్వర్యంలో మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తీన్మార్ మల్లన్న ఇదివరకే బీజేపీలో చేరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే.. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? లేదంటే మరో పదవిని కట్టబెడతారా? అనేది సందిగ్దంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల లేదా కామారెడ్డి నుంచి టికెట్ ఇస్తే.. కేసీఆర్ లేదా కేటీఆర్‌పై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా.. ప్రచారాలకు మాత్రమే వినియోగించుకుని పార్టీ గెలిచాక పదవిని ముట్టజెప్తే దీనికి మల్లన్న ఒప్పుకుంటాడా లేదా? అనేది తెలియాల్సివుంది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మల్లన్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం హస్తానికి ఫ్లస్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇతర పార్టీల ప్రముఖ నాయకులు కాంగ్రెస్ చేరుతుండగా అధికార పార్టీకి ప్రస్తుతం కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ సైతం బీసీ నినాదంతో దూసుకుపోతోంది. మరి అధికారం ఎవరి సొంతం కానుందనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.