గ్రామ పంచాయతీ సర్పంచుల విషయంలో రేవంత్ (Revanth) సర్కార్ కీలకనిర్ణయం తీసుకొంది.. వీరి పదవి కాలం నేటితో ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ శాఖలకు చెందిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్టు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. మరోవైపు నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీల్లో (Gram Panchayaths) ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. దీంతో రాష్ట్రంలో సర్పంచ్ల (Sarpanch) పాలనకు నేటితో తెరపడింది.. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగగా, ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలును కల్పించింది.
ప్రభుత్వ నిర్ణయంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. మరోవైపు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం మొదలవుతుంది. ఈ నిర్ణయంతో హనుమకొండ జిల్లాలోని 208, వరంగల్ జిల్లాలోని 323, మహబూబాబాద్ జిల్లాలోని 461, జనగామ జిల్లాలోని 281, ములుగు జిల్లాలోని 173, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 241 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.