నాగార్జునసాగర్ (Nagarjunasagar) డ్యామ్ పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. నిన్న ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ తెలంగాణ పోలీసులపై, ఏపీ (AP) పోలీసులు కేసు నమోదు చేశారు. ఫల్నాడు విజయపురి (Palnadu Vijayapuri) పీఎస్ లో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు..
సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఏపీ పోలీసులు.. తెలంగాణ (Telangana) పోలీసులపై కేసు నమోదు చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటాపోటీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికీ జల వివాదం మొదలై మూడు రోజులు అవుతున్నా ఇంకా వివాదం పరిష్కారానికి మార్గం దొరకడం లేదని అంటున్నారు.
ఇదివరకే తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్‌పైకి అక్రమంగా చొరబడ్డారని డ్యామ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులు వెల్లడించారు. అలాగే అనుమతి లేకుండా సాగర్ నీటిని ఏపీకి విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కంప్లైంట్ చేశారు.
మరోవైపు కృష్ణ జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి గుర్తుకు రాని అంశం.. సరిగ్గా ఎన్నికల రోజునే ఏపీ అధికారులకు గుర్తుకు రావడం.. అదే రోజు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయనే విషయాన్ని విస్మరించి ప్రవర్తించడం పలు అనుమానాలకు తావిస్తుందని అనుకుంటున్నారు..