కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పార్టీ గ్రాఫ్ పెరగడానికి కారణం అయ్యాయి.. దీంతో ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలో పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్వ బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ (Komati Reddy Brothers)కు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారినట్టు జనం అనుకుంటున్నారు.
వరుసగా నాలుగు సార్లు నల్లగొండ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkata Reddy) స్థానికంగా పట్టున నేత.. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వీస్తూంది కాబట్టి.. ఈ ఎన్నికల్లో గెలిచి తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి కసిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొరకరాని కొయ్యగా మారిన వెంకట్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని ప్రణాళికలు రచిస్తున్నారు కేసీఆర్..
మరోవైపు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy).. మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశాడు.. అయితే ఈసారి గెలిచి తన సత్తా చాటాలని రాజగోపాల్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు గురు శిష్యులుగా ఉండి.. చట్టసభలకు కలిసి వెళ్ళిన కోమటిరెడ్డి బ్రదర్స్, నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారిపోవడం.. నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అసలు సమయం సందర్భం లేకుండా వీరు చేసుకుంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు ఈ నియోజక వర్గంలో వేడి పుట్టిస్తున్నాయి. ఇదేసమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.. అదీగాక నియోజకవర్గ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ లోకి వెళ్ళిన చిరుమర్తి లింగయ్యను ఓడించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పది స్థానాలను కైవసం చేసుకుంటుందని కోమటిరెడ్డి బ్రదర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు, బీఆర్ఎస్ కు సవాల్ గా మారాయి. మరి ఇక్కడి ఓటర్లు కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్ను పెంచి వారి అంచనాలను నిజం చేస్తారో.. లేదా షాకిస్తారో వెయిట్ అండ్ సీ..