ఐదు సంవత్సరాలు నిన్ను ఆడించే నేతలను నువ్వు ఆడించే రోజు ఏదైనా ఉందంటే.. అవి ఎన్నికల రోజులు మాత్రమే అంటున్నారు.. ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో.. నీ ఐదు సంవత్సరాల జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చని ఓటు విలువ తెలియచేస్తున్నారు కొందరు.. అవినీతి ఆసురుల నుంచి రక్షించుకోవాలంటే ఓటును అస్త్రంగా ప్రయోగించాలని తెలుపుతున్నారు. కొందరు ఈ మాటలను అక్షరాల పాటిస్తూ.. ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలి (Gachibowli)కి చెందిన 75 ఏళ్ల శేషయ్య ఓటు విలువ తెలియచెప్పి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే తీవ్రమైన లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న శేషయ్య.. ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తనకున్న అనారోగ్యాన్ని లెక్కచేయకుండా.. ఓటు హక్కును ఉపయోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు శేషయ్య.. గచ్చిబౌలి జీపీఆర్ఏ (GPRA) క్వార్టర్స్‌లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ.. ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యతని తెలిపారు. తాను 1966 నుంచి మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని వెల్లడించారు. మరోవైపు ముషీరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన వెలుగుచూసింది. గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల గ్రౌండ్‌లోని 83వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
ఇక తెలంగాణ లో ఎన్నికల (Telangana Elections) పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు..