తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress)పార్టీ అధికార పీఠం ఎక్కాలని తీవ్రంగా శ్రమిస్తున్న విషయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అసంతృప్తులతో, ఆశావహులతో నీటిలో పడవలా తెలియాడుతున్న కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో అధికారం తమదే అనే ధీమాలో ఉంది. ఇప్పటికే జోరుగా నేతల వలసలతో నిండుకుండలా కనిపిస్తున్న హస్తం అధికారం చేపట్టాక ప్రజలకు ఏం చేయాలో.. ఎలా పాలన సాగించనుందో అనే అంశాల మీద మేనిఫెస్టో రెడీ చేసినట్టు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు (Shridhar Babu) తెలిపారు. అయితే తుది కసరత్తు జరుగుతోందని అన్నారు.
మరోవైపు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS)ని, దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) సక్సెస్ అయిన వ్యూహాలను తెలంగాణలో వాడుతోంది.. ఇప్పటికే ఆరు గ్యారంటీలను ప్రకటించి వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో పూర్తి హామీలతో కూడిన మేనిఫెస్టోను కూడా ఇప్పుడు సిద్దం చేసిన హస్తం.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి సిద్దమయ్యింది.
ఈ క్రమంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ గాంధీభవన్ లో సమావేశం అయ్యింది. ఈ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాల పై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా ఏమేం చేయనుందో మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలుపనున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టో వుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందేలా చూస్తామని… ఇందుకోసం సరికొత్త అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు.