తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినట్టే వస్తున్నాయనే టాక్ మొదలైంది. మరోవైపు రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ (BRS) హవా తగ్గినట్టు వెల్లడించాయి. అయితే గులాబీ నేతల్లో గుబులు మొదలవకుండా అధినేతతో పాటు కేటీఆర్ (KTR) కవిత (Kavith) కూడా కాస్త బూస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారని తెలిసిందే.. కానీ ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాలు మొదలైతే ఏం జరుగుతుందో తెలియచెప్పేలా ఉన్నాయంటున్నారు.
మరోవైపు తెలంగాణలో తిరుగులేదని భావించిన బీఆర్ఎస్ కు కొలుకొని దెబ్బ తగులుతుందని ప్రచారం జరుగుతుంది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం గా రికార్డ్ సృష్టిద్దామని భావించిన కేసీఆర్.. మూడోసారి సీఎం అవ్వడమేమో కానీ, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క చోట ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోందని టాక్ వినిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఏర్పడ్డ త్రిముఖ పోరులో.. విజయం ఖాయం అనే ధీమాతో కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు..
ఒకవైపు కామారెడ్డిలో కేసీఆర్ (KCR)కు పోటీగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలువగా.. గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఢీకొన్నారు.. ఇప్పటికే బీఆర్ఎస్ పాలనలో రేవంత్, ఈటల పలు అవమానాలు ఎదుర్కొన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ పై గెలవాలని పట్టుదలగా బరిలో నిలిచారు.. కానీ ఈటలకు ఊహించని షాక్ తగాలగా.. రేవంత్ మాత్రం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది.
మరోవైపు గజ్వేల్ లో ఓటమి భయంతోనే గులాబీ బాస్ కామారెడ్డి బరిలో నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కేసీఆర్ కి కామారెడ్డిలో షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతే, 40 ఏళ్ళ తర్వాత ఇది ఆయనకు ఎమ్మెల్యేగా మొదటి ఓటమి అవుతుంది. మొదటిసారి 1983 లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కేసీఆర్.. తర్వాత సాధారణ, ఉప ఎన్నికలు కలిపి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు. అలాంటి కేసీఆర్ 40 ఏళ్లుగా ఉన్న రికార్డ్.. ఒక్క ఓటమితో గల్లంతు అవుతుందని అంటున్నారు.