రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. కాగా ఇంత ఎన్నికల వేడిలో కూడా రైతులు రైతు బంధు (Rythu Bandhu) కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని వారిని నిరాశపరిచే విషయం ఈసీ వెల్లడించింది. రైతు బంధును తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలిచ్చింది.
మరోవైపు ఎన్నిల సంఘం రెండ రోజుల క్రితం రైతుబంధు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారం తమదే అనే ధీమాతో గులాబీ బాస్ కేసీఆర్ (KCR)..కేటీఆర్ (KTR)..హరీశ్‌రావు (Harish Rao) కనిపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి.. రైతుబంధు నిధుల విడుదలపై కసరత్తు కూడా చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సమయంలో కేసీఆర్.. హరీశ్‌రావు అత్యుత్సాహం.. రైతుబంధుకు రాయిలా అడ్డుపడిందనే ప్రచారం మొదలైంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. కొన్ని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలు.. మరోవైపు రైతుబంధు అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, ఇలా ప్రకటించడం తప్పుగా భావించిన కాంగ్రెస్.. ఈ విషయాన్ని మళ్లీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.
హరీశ్‌రావు ప్రెస్‌మీట్ వీడియో, పత్రికల్లో వార్తల క్లిప్పింగ్స్, కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు, బీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్న వీడియోలు, ఫొటోలు కూడా ఫిర్యాదులో జతపర్చింది. ఇవన్నీ పరిశీలించిన ఎన్నికల సంఘం..ఎన్నికల నియమాళిని బీఆర్ఎస్ ఉల్లంఘించిందని గుర్తించింది.
రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతులను ఈసీ రద్దు చేసింది.
ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కేంద్రం ఎన్నికల సంఘం రెండు పేజీల లేఖ పంపింది. ఇందులో కారణాలను స్పష్టంగా వెల్లడించింది. మరోవైపు ఈసీ నిర్ణయం పూర్తిగా బీఆర్‌ఎస్ స్వయంకృతాపారాధమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండి, ఈసీ నిబంధనలను కనీసం చదవకుండా అత్యుత్సాహం ప్రదర్శించడమే రైతుబంధు అనుమతుల రద్దుకు కారణమని పేర్కొంటున్నారు.