నేతల మాటలు తామరాకు మీద నీటిబొట్టు లాంటివని అంటారు.. కొన్ని సందర్భాలలో నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఏమాట ఎప్పుడు మారుస్తారో ఊహించడం నేతల విషయంలో కష్టం అనే వారు కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పరిస్థితి ఇలాగే ఉందని కొందరు అంటున్నారు.. అధికారం కోసం ఎన్ని పార్టీలు మారడానికైనా నేతలు సిద్దమే? అని అనుకోని వారు లేరు !..
ఇక మునుగోడు (Munugodu) అనగానే ఏడాది క్రితం జరిగిన ఉపఎన్నికలు గుర్తుకు వస్తాయి.. ఈ ఎన్నికలు అత్యంత భారీ బడ్జెట్ సినిమాని తలపించే రేంజ్ లో సాగాయి. కాగా ప్రస్తుతం మరొక్కసారి వార్తల్లో మునుగోడు ప్రస్తావన జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రా ప్రజలందరూ మరోసారి మునుగోడు గురించి చర్చించుకుంటున్నారు. దానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy Rajagopal Reddy).
ఉపఎన్నికలలో ఓటమి చెందిన రాజగోపాల్ రెడ్డికి.. బీజేపీ (BJP) తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ నేపధ్యంలో ఆయన కమలాన్ని వీడుతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోవడం ఖాయమని జోరుగా చర్చలు సాగుతున్నాయి.. అదీగాక ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. తన భార్య లక్ష్మిని మునుగోడు నుంచి పోటీలోకి దింపాలననే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్ష్మి బైపోల్ సమయంలో మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలతో కలిసిపోయి పాపులారిటీ తెచ్చుకున్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో తన భార్యను బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు. కాగా ఈ విషయం పై త్వరలో క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు.