తెలంగాణ ప్రభుత్వ టర్మ్ ఈసారికి ముగింపు దశకు చేరుతోంది. సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగే ఛాన్స్ ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గంపెడాస పెట్టుకున్న కేసీఆర్ సర్కార్.. ఈ అంశంతోపాటు విపక్షాలను ఇరుకున పెట్టే వాటిపై దృష్టి పెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి అంతా సిద్ధం చేసుకుంది.
ముచ్చటగా మూడోసారి అధికారం కోసం కేసీఆర్ ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈనెల 18 తర్వాత ఎప్పుడైనా బీఆర్ఎస్ తన మొదటి విడత అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 85 నుంచి 90 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని నేతలు అనుకుంటున్నారు. ఎటూ తేల్చని నియోజకవర్గాలకు కొంతకాలం వేచి చూసి.. మిగిలిన వాటికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు.
ఓవైపు అభ్యర్థులపై ఫోకస్ చేసిన ప్రభుత్వం.. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కొనేందుకు రెడీ అయింది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లుల అంశంపై బీజేపీని కార్నర్ చేయాలని చూస్తోంది. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర బీజేపీని ఒకేసారి టార్గెట్ చేసేందుకు పథకం రచించింది. గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని శాసనసభలో మళ్లీ ప్రవేశ పెట్టనుంది.
మరోవైపు, ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా సభలో ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలతో పాటు ఆందోళనలు చేసింది గులాబీ పార్టీ. అసెంబ్లీలో ఈ అంశంపై కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అయితే.. విపక్షాలు కూడా అదే దీటుగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ విమర్శల దాడి చేయాలని చూస్తోంది. మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో పొలిటకల్ హీట్ నెలకొంది.