రాజకీయ పార్టీలు (Political Parties) చేసిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 10 విజ్ఞప్తులను చేసిందని తెలిపారు. వాటిలో 9 విజ్ఞప్తులను ఆమోదించినట్టు తెలిపారు. పలు చోట్ల పోటీ తీవ్రంగా ఉందన్నారు. ఆ ప్రాంతాలతో పాటు ఘర్షణకు అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించినట్టు చెప్పారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించామన్నారు. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశామని, వాటిపై ఇప్పటి వరకు వివరణ అందలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు జరుపుతున్నామన్నారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ. 709 కోట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఏకే గోయల్ ఇంట్లో ఏమీ దొరకలేదని ప్రాథమిక నివేదిక వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 1,68,612 పోస్టల్ బ్యాలెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో 96,526 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇటీవల టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్ భేటీలో మంత్రి కేటీ ఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
ఇది ఇలా వుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. కొడంగల్‌లో అరాచకం నడుస్తోందని పేర్కొంది. నియోజకవర్గాన్ని రక్తసిక్తం చేస్తోందని ధ్వజమెత్తింది. కొడంగల్‌లో రెచ్చగొడుతూ బీభత్సానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ అన్నారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు రేవంత్‌రెడ్డి సోదరుడు ఇతరులు ప్రయత్నించారని ఆరోపించారు.
కొడంగల్‌లో స్థానిక పోలీసులు పక్షపాతంగా వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బాబా ఫసియుద్దీన్‌తో కలిసి సోమా భరత్ ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ పలుమార్లు పోలీసులు ఫిర్యాదు చేశామన్నారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోమా భరత్ తెలిపారు. ఈసీ సరిగ్గా స్పందించకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామని వెల్లడించారు.