బీఆర్ఎస్ ( BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ వైరల్ ఫీవర్ (Viral Fever) బారిన పడ్డారని మంత్రి కేటీ ఆర్ తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కేసీఆర్ కు బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ (Bacterial Infection) వచ్చిందన్నారు. తాజాగా కేసీఆర్ కు చెస్ట్ ఇన్ ఫెక్షన్ వచ్చిందని మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మొదట కేసీఆర్ కు వైరల్ ఫీవర్ వచ్చిన సమయంలో కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ క్రమంలో అన్ని అనుకున్నట్టు జరిగితే కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడ్డాక ఈ నెల మొదటి వారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి.
తాజాగా ఆయనకు చెస్ట్ ఇన్ ఫెక్షన్ రావడంతో కేబినెట్ భేటీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ఎవరినీ కలవడం లేదని ఆయన తెలిపారు. త్వరలో ఆయన కోలుకుంటారని, ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ లతో పోలిస్తే బీఆర్ఎస్ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తోంది.