తెలంగాణకు కొత్త సీఎం ఎవరనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు నూతన సీఎం విషయంలో కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. సీఎల్పీ (CLP) భేటీలో ఓ నిర్ణయం తీసుకుని దాన్ని ఏఐసీసీకి అప్పగించారు. ఇప్పుడు సీఎం ఎవరనే విషయంలో ఢిల్లీలోని సోనియాగాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ కు సమాచారం అందించారు. దీంతో సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం విషయంలో ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఇది ఇలా వుంటే నూతన సీఎం కోసం కాన్వాయ్ ను సాధారణ పరిపాలన శాఖ రెడీ చేసింది. ప్రాథమికంగా వైట్ కలర్ కాన్యాయ్‌ను అధికారులు రెడీ చేశారు. మొత్తం ఆరు ఇన్నోవా కార్లు దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి వచ్చి చేరుకున్నాయి.
ఆ కాన్వాయ్‌లో రెండు కొత్త కార్లు, వాటితో పాటు మరో నాలుగు పాత కార్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికే నంబర్ ప్లేట్ అలాట్ అయినవి ఉన్నాయి. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్యాయ్‌లో సీఎం ఇంటికి వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఎం తన కోరిక మేరకు కాన్వాయ్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.