తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ విజయం తర్వాత రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొదట ఈ నెల9న కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నెల 9 న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టు డీజీపీ అంజన్ కుమార్ తెలిపారు.
ఆ కొద్దిసేపటికే సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు అప్పగించారు. ఇది ఇలా వుంటే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేపు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి.
సీఎం ఎంపికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏఐసీసీ నేతలు సేకరించనున్నారు.
దీని ఆధారంగా సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో రేపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ని కాంగ్రెస్ నేతలు కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతో సీఎం ఎంపిక ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారా లేదా వేరే ఎవరికైనా ఇస్తారా అనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మొత్తం 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. సీఎం ఎంపిక విషయంపై అధిష్టానం తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ వెల్లడించారు.