– కాంగ్రెస్ రెండో లిస్ట్ ఎప్పుడు?
– పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ..
– సమావేశంలో ఏం జరగనుంది?
– లెఫ్ట్ పార్టీలు తగ్గుతాయా?
– కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్న..
– ఇద్దరు, ముగ్గురు నేతలు
తెలంగాణ (Telangana) లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ (Congress). కర్ణాటక (Karnataka) లో వర్కువట్ అయిన స్ట్రాటజీలను ఇక్కడ అమలు చేస్తూ ఓటర్లు రాబట్టే పనిలో ఉంది. ఇంకోవైపు గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని తెగ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. రెండో లిస్ట్ ప్రిపరేషన్ లో ఉంది. బుధవారం పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ భేటీలో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
నిజానికి సెకెండ్ లిస్ట్ ఎప్పుడో బయటకు రావాల్సి ఉంది. కానీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతోనే ఆలస్యం అయింది. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. ఇప్పటివరకూ 35 నుంచి 40 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత రెండో లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్ బయటకొచ్చాకే లెఫ్ట్ పార్టీలతో జరిగిన సీట్ల సర్దుబాటు అంశం బయటకు రానుంది.
పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు.. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కానీ, పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే.. ఆ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సిద్ధం అయ్యారు. దీంతో పాలేరు ఇచ్చేందుకు హస్తం పార్టీ ఒప్పుకోవడం లేదు. వైరాతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటులో వామపక్ష నాయకులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఏఐసీసీ ఆదేశించినట్టు సమాచారం.
మరోవైపు, కొన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నేతలు పోటీకి సై అంటున్నారు. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ఇరు వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి వారికి అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్ పేట, ఎల్బీ నగర్, నర్సాపూర్ తదితర పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు ఉండడంతో.. ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీ అందరి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు సమాచారం. బుధవారం జరిగే సమావేశం తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.