– త్వరలో కాంగ్రెస్ బస్సు యాత్ర
– అంతా సిద్ధం చేస్తున్న సునీల్ కనుగోలు
– ప్రతీ జిల్లాలో ఓ బహిరంగ సభ
– ఆరు గ్యారెంటీల ప్రచారమే అజెండా
– ఉత్తర తెలంగాణపై ఫోకస్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ (Congress) కు చెందిన అగ్ర నేతలు ఢీల్లీ (Delhi) లో ఉన్నారు. ఓవైపు సమావేశాలకు హాజరవుతూనే ఇంకోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే లిస్టును పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ ఫైనల్ లిస్ట్ ను ప్రిపేర్ చేస్తుంది. ఇంకోవైపు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రకటించిన ఆరు గ్యారెంటీలను జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహ రచనలో ఉన్నారు ఆపార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu).
కర్ణాటక (Karnataka) లో సునీల్ వ్యూహాలు వర్కవుట్ అయ్యాయి. కాంగ్రెస్ కు అధికారం దక్కించడంలో కీలక పాత్ర పోషించిన ఈయన.. ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో గెలుపు ప్రయత్నాల్లో ఉన్నారు. తుక్కుగూడ సభా వేదికగా సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. ఈ యాత్ర అక్టోబర్ 2న ప్రారంభం కానుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
బస్సు యాత్రకి సంబంధించిన పూర్తిస్థాయి రూట్ మ్యాప్ సునీల్ కనుగోలు పర్యవేక్షణలో సిద్ధం అవుతోంది. ఈ యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ, రాష్ట్ర కీలక నాయకులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉండడం వల్ల సునీల్ సూచనలతో అక్కడి నుండే బస్సు యాత్ర చేపట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ యాత్ర ద్వారా అసంతృప్త నేతలను కూడా బుజ్జగించి.. కలిసికట్టుగా ముందుకు సాగేలా ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
అక్టోబర్ 2న బాసర సరస్వతి ఆలయం వద్ద కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం మీదుగా యాత్ర సాగేలా సునీల్ అంతా సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రతో ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది హస్తం నేతల ప్లాన్. ఇప్పటికే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా.. మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.