తెలంగాణ (Telangana)లో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే ప్రజలంతా ఏకమై కారు టైర్లు పంక్చర్ చేయాలని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి (Komatireddy) రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy).. కేసీఆర్ (KCR) ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆరోపించారు. చండూర్ సీపీఐ (CPI) ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకొన్న బీజేపీ.. లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ అవినీతికి కేంద్రం వంతపాడుతుందని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో అవినీతి బీఆర్ఎస్ అంతం అవుతుందని భావించి తాను బీజేపీలో చేరానని.. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ ని ఓడించడం బీజేపీ వల్ల కాదని తెలిసిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగినా.. ఇప్పుడు డీలా పడిందని ఆరోపించారు.. ఇక కాంగ్రెస్ లక్ష్యం.. తన లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దింపడమేనన్న రాజగోపాల్ రెడ్డి.. కమ్యూనిస్టుల పొత్తు వల్లే 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అని భావిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు.