తెలంగాణ ఎన్నికల పోలింగ్(Telangana Elections Polling) ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపడుతున్నా ఫలితాన్నివ్వడంలేదు. పలు పోలింగ్ కేంద్రాల(Polling Centers) వద్ద ఉద్రిక్త పరిస్థతి నెలకొనగా తాజా, నర్సాపూర్ నియోజకవర్గం(Narsapur Constancy) లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కమల పుల్ సింగ్ తదితరులు పోలింగ్ కేంద్రానికి బుధవారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ కాట్రోత్ చిన్న కేతావత్ సురేష్, కేతవత్ నరేష్ గుగులోతు దేవేందర్‌లతో పాటు మరి కొంతమంది సుధీర్ రెడ్డి స్కార్పియో వాహనంపై రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో ఘటన.. గురువారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి చిన్న కుమారుడు శశిధర్ రెడ్డి కౌడిపల్లి మండల పరిధిలోని బిట్ల తండా గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమంలో చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో ఆగ్రహించిన తండావాసులు శశిధర్‌రెడ్డి ఇన్నోవా వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం ముందు భాగంలోని అద్దాలు ధ్వంసం అయ్యాయి.
మరో ఘటన, మణికొండ పోలింగ్ బూత్ వద్ద చోటుచేసుకుంది. ఇరు పార్టీ నాయకుల మధ్య గొడవ జరగడంతో పోలింగ్ బూత్ బయట ఉన్న కుర్చీలు, టేబుళ్లను ఎక్కడిక్కడ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్‌కు సమీపంలో నేతలు డబ్బులు పంచుతున్నారంటూ స్థానికులు ఆరోపించారు.
అదేవిధంగా, ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి స్థానిక పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు మహేందర్‌రెడ్డి కారుపై రాళ్లదాడికి దిగారు.