తెలంగాణ (Telangana) రాష్ట్ర నేతలంతా అసెంబ్లీ ఎన్నికల వేడిలో ఉన్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్ (BRS) ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రచారాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగిస్తూ పార్టీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకొంటున్నారు. అయినా ఎక్కడో ఒకచోటా విభేధాలు బయటపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోన్న సీఎం కేసీఆర్(KCR)కి ఈ సమస్య తలనొప్పిగా మారిందని అనుకొంటున్నారు.
అయితే బీఆర్‌ఎస్ లో నెలకొన్న వర్గపోరు పరిష్కరించే బాధ్యతలని భుజాన ఎత్తుకొన్న చిన్నదొర కేటీఆర్ (KTR)వాటిని ఇప్పటి వరకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని ప్రచారం.. కాగా మరో నియోజక వర్గంలో అసమ్మతి గొంతు వినిపిస్తోంది. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal)జిల్లా అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అబ్రహాం (MLA Abraham), ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి (MLC Challa Venkatamireddy)వర్గాల మధ్య వచ్చిన చీలిక కేడర్‌లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో టికెట్ మళ్లీ ఎమ్మెల్యే అబ్రహాంకి ఇవ్వడాన్ని పార్టీలో ఉన్న కొందరు బలంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అబ్రహాంని మార్చాలంటూ ఏకంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి ఏకవాక్య తీర్మానం సమర్పించి.. అబ్రహాం స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రెండువర్గాల నేతలు, అనుచరుల సమావేశాలు అలంపూర్ బీఆర్ఎస్‌లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇక బీఫాం చేతికొస్తుందనుకున్న టైంలో అసమ్మతి వర్గం అడ్డుపడటంతో అబ్రహాం గందరగోళంలో పడినట్టు అనుచరులు అనుకొంటున్నారు.
మరోవైపు వ్యతిరేకవర్గం ప్రచారాన్ని నమ్మొద్దంటున్న ఎమ్మెల్యే వర్గం.. అధినాయకత్వానికి అభ్యర్థి మార్పు ఆలోచనే వద్దని మొరపెట్టుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయన టికెట్ మారిస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా నిలబెట్టి గెలిపించుకుంటామని ఎమ్మెల్యే అబ్రహాం అనుకూలవర్గ నేతలు స్పష్టం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన అభ్యర్థులందరికీ బీఫాంలు ఇచ్చిన అధినేత.. అలంపూర్ విషయంలో పునరాలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలంపూర్ అభ్యర్థిని మార్చే ఆలోచనతోనే అబ్రహాంకి బీఫాం ఇవ్వలేదంటోంది ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. దీంతో అలంపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందా? చివరికి బీ ఫాం ఎవరికిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.