తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections-2023) దగ్గర పడుతున్నాయి. మరో 14రోజులే ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్‌కు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుశాఖ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది.
అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నికల అధికారులు మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎట్టిపరిస్థితుల్లో సెల్‌ఫోన్ తీసుకువెళ్లకూడదని స్పష్టం చేశారు. అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేసి ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ముఖ్యంగా వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం వంటివి చేస్తే వారి ఓటును రద్దు చేసి కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా.. పోలింగ్ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. ఆ ఓటు రద్దు అయినట్లే. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరన్నమాట.
అదేవిధంగా పోలింగ్ రోజున మీడియా ఛానళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఏదైనా ప్రతికూల వార్త ప్రసారమైతే నోడల్ అధికారి వెంటనే వాస్తవ వివరాలు తెలుసుకోనున్నారు. నవంబరు 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.