ఎన్నికల సమీపిస్తుండడంతో నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ప్రధాన పార్టీల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీల (Congress) మధ్య రాళ్ల వర్షం కురిసింది.
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(BRS Candidate Manchireddy Kishan Reddy), కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (Congress Candidate Malreddy Rangareddy) నామినేషన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నామినేషన్ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకేసారి భారీ ర్యాలీలు నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వాహనం దిగి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు.
ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.