తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(TS Election Polling) షురూ అయింది. ఓటర్లు తెలంగాణ ఐదేళ్ల భవిష్యత్తును ఈ రోజే నిర్ణయిస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి తమ వజ్రాయుధం(ఓటు)ను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా ముధోల్లోని ముక్తదేవి గల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు ఓటర్లు కండువాలతో రావడం కలకలం రేపింది. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఓటర్లను అడ్డుకున్నారు. కండువాలతో వచ్చి ఓటు వేయడానికి రావద్దని వారికి సూచించారు. ఈ క్రమంలో 100 మీటర్ల దూరంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కండువాలు ఎందుకు వేసుకుని వెళ్తున్నారని ఓ పార్టీ కార్యకర్తలు అడగడంతో వివాదం తలెత్తింది. తాము పార్టీ కండువా వేసుకోలేదని, ఆ కలర్ కర్చీఫ్ మాత్రమే వేసుకున్నామని వేరొక పార్టీ కార్యకర్తలు బదులిచ్చారు. అదేవిధంగా, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మన్ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్న క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.