రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో (Power Suply) తెలంగాణ డిస్కంలు (Telangana Discoms ) కొత్త రికార్డు సృష్టించాయి.
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. ఇప్పటి వరకు గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అత్యధిక రికార్డుగా ఉండేది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. విద్యుత్ సంస్థలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నపటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.
మరోవైపు కాంగ్రెస్ సర్కార్ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు గానూ ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. గృహజ్యోతి కోసం ఇప్పటివరకు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డు ఉన్న వారి దరఖాస్తుల సంఖ్య 64 లక్షలుగా ఉంది. వీరిలో 34లక్షల 59 వేల 585 మందికి మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నారు.