ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య వివాదాలు కొత్తేం కాదు. చాలాకాలంగా ఏదో ఒక ఇష్యూకు సంబంధించి వార్ జరుగుతూ వస్తోంది. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అంశంతో వివాదం మరోసారి చర్చకు తావిచ్చింది. తాండూరు టికెట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) కే కేటాయించడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశించిన పట్నం మహేందర్ రెడ్డి (Mahender Reddy) కి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కకుండా ఉండేందుకు మంత్రి పదవితో బుజ్జగిద్దామని కేసీఆర్ (KCR) అనుకున్నారు.
కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును మహేందర్ రెడ్డికి ఇచ్చి ఇష్యూని సైలెంట్ చేసేందుకు చూస్తున్నారు. కానీ, కేసీఆర్ అనుకున్నది జరగడం లేదు. ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలంటూ సీఎంవో నుంచి రాజ్ భవన్ కు మంగళవారం నోట్ పంపించారు. అయితే.. బుధవారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ టైమ్ ఇచ్చి తర్వాత రద్దు చేశారు. తమిళిసై (Tamilisai) తీవ్ర పంటి నొప్పితో బాధ పడుతుండటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
గవర్నర్ డెంటల్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లడం, ఇతర కారణాలతో టైమ్ ఇచ్చి క్యాన్సిల్ చేశారని తెలిసింది. అయితే, గురువారం మంచి రోజు కాకపోవడంతో శుక్రవారం ప్రమాణ స్వీకారం ఉండొచ్చని అంటున్నారు. ఈటల బర్తరఫ్ తో ఖాళీ అయిన స్థానాన్ని పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేస్తున్నారు కేసీఆర్. ఆయనకు వైద్య ఆరోగ్యశాఖను అప్పగిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్. తదనంతర పరిణామాల్లో భాగంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో తాండూరులో పైలట్ వర్సెస్ పట్నం అన్నట్లు మారింది.