తెలంగాణ (Telangana)కి గవర్నర్ (Governor) గా తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్ కి మధ్య ఏనాడూ స్నేహపూరిత వాతావరణం ఏర్పడలేదు. అదీగాక ఒకరి పై ఒకరు తరచుగా ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. కాగా తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై (Chennai)లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ (ABP Southern Rising Summit) 2023లో మాట్లాడిన తమిళిసై..ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మంచి సంబంధాలు ఉండాలని, కానీ దురదృష్టవశాత్తు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో అలాంటి సంబంధాలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమం లో కలవడం మినహా, గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర సీఎం తనను కలవలేదని పేర్కొన్నారు.
గవర్నర్ నిర్ణయాలపై కొందరు రాజకీయం చేస్తూ గవర్నర్ వ్యవస్థ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్లు అంటే రబ్బరు స్టాంపులు కాదని, ప్రతి ఫైల్ సంతకం చేసి పంపించడాని అన్నారు.. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి విషయంలో ఒక అడుగు ముందే ఆలోచిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సీఎంలు ముందుకు రావాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది గవర్నర్ వ్యవస్థ అవసరం అంటారు. అధికారంలోకి రాగానే గవర్నర్ వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నిస్తుంటారు. గవర్నర్ అంటే ఏ ఒక్క వ్యక్తి కోసమో, సొంత ప్రయోజనం కోసమో పనిచేసే వ్యక్తి కాదని ఈ సందర్భంగా తెలిపారు.