Telugu News » Medigadda: డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై రజత్ కుమార్ కీలక సమీక్ష….!

Medigadda: డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై రజత్ కుమార్ కీలక సమీక్ష….!

నివేదికలో అథారిటీ చెప్పిన అంశాలు, ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలని అధికారులతో ఆయన చర్చించినట్టు సమాచారం.

by Ramu

మేడిగడ్డ బ్యారేజీపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ (Rajath Kumar) సమీక్ష (Review) నిర్వహించారు. నివేదికలో అథారిటీ చెప్పిన అంశాలు, ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలని అధికారులతో ఆయన చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఈఎన్సీలు, ఇంజినీర్లతో డ్యామ్ గురించి రజత్ కుమార్ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

ఎన్ఎస్డీఏ నివేదికలో లేవనెత్తిన అంశాలపై ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం ఇతర అధికారులతో ఆయన సవివరంగా చర్చించారు. అథారిటీ చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారలతో సమాధానం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజిని నిర్మించారు. అక్టోబరు 22న బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగి పోయింది. దీంతో 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగి పోయింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బ్యారేజీలో 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్దకు ఆరుగురు నిపుణుల బృందాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ పంపించింది. బ్యారేజీ దగ్గర పగుళ్లు ఏర్పడిన పిల్లర్లను అథారిటీ సభ్యులు పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 20 అంశాలను అధికారుల నుంచి అథారిటీ కోరింది. దీంతో అందులో 18 అంశాలను డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది.

దీంతో పాటు మరో రెండు అంశాలపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ పరిశీలించిన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పిల్లర్ల కింద ఉండే ఇసుక కోతకు గురైందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత బ్యారేజీ లోపం ఉన్నట్టు అథారిటీ వెల్లడించింది .

You may also like

Leave a Comment