దళిత బంధు.. దేశానికే ఆదర్శం అనేది బీఆర్ఎస్ వాదన. కాదు, ఇది కమీషన్లతో నిండిన దగా అనేది విపక్షాల కౌంటర్. దళితుల అభ్యున్నతి అని ప్రభుత్వం అంటుంటే.. ఇది బీఆర్ఎస్ వాళ్ల అభ్యున్నతే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఈ పథకమే ప్రధాన ఎజెండాగా కారు పార్టీ సమరానికి కాలు దువ్వాలని చూస్తుంటే.. అందులో జరుగుతున్న అవినీతిని హైలైట్ చేయాలని విపక్ష నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే.. ప్రభుత్వం అనుకున్నట్టు రెండో విడత దళిత బంధు పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు.
జులై నెల నుంచి పంపిణీ ప్రారంభించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ, జులై నెల అయిపోయింది గానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్నది లేదు. దీనికి కారణం నిధుల సర్దుబాటులో జాప్యం అనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను ఓడించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. నియోజకవర్గంలో దళితులు అధికంగా ఉండడంతో ఈ పథకం ప్లస్ అవుతుందని భావించారు. కానీ, వర్కవుట్ కాలేదు. జనం ఈటల వైపే నిలబడ్డారు. కేసీఆర్ కు దిమ్మ తిరిగే ఫలితాన్నిచ్చారు. హుజూరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. దాని కారణంగా ఈటల చేతిలో ఘోర పరాభవం తప్పలేదు.
దళిత బంధు సాయం కింద ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తానికి అప్పట్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కీంను అమలు చేశారు. మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట వంద మందికి, మరో నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలు చేశారు. అనంతరం ఏటా 1.77 లక్షల మందికి స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో 2022–23 బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు. కానీ, ఆ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో రెండో విడతలో భాగంగా హుజూరాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పథకాన్ని అమలు చేయాలనేది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీనికోసం అధికారులు లెక్కలు కడుతున్నారట. అయితే.. నిధుల కొరత కారణంగా ఎక్కువమంది దళిత బంధు ఇచ్చే పరిస్థితి లేదనే చర్చ జరుగుతోంది.
గత నెలలో అర్హుల ఎంపిక ప్రక్రియపై ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. నియోజకవర్గానికి 1,100 దళిత కుటుంబాలకు ఈ స్కీం ను అమలు చేస్తామని, జిల్లాల కలెక్టర్లు నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ఎంపిక చేస్తారని పేర్కొంది. కానీ, ఏదీ అనుకున్నట్టు జరగడం లేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఖజానాను నిధుల కొరత వెంటాడుతుండడంతో దళితులకు రూ.10 లక్షలు విడతల వారీగా ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రగతి భవన్ లో జరుగుతున్నట్టు సమాచారం. ఒక్కో సెగ్మెంట్ లో వంద మందికి ఒకేసారి రూ.10 లక్షలు ఇస్తే రూ.1,180 కోట్లు అవసరం అవుతాయి. అదే ఒక్కో సెగ్మెంట్ లో 200 మందికి అంటే రూ.5 లక్షలు జమ చేస్తే కూడా అంతే మొత్తం అవుతుంది. ఇక రూ.3 లక్షల చొప్పున ఇస్తే నియోజకవర్గానికి 333 మందికి ఇవ్వొచ్చని అధికారులు లెక్కలు కట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నిధులను బట్టే దళిత బంధు పంపిణీ ఉంటుంది.
మరోవైపు, ఈ స్కీం అంతా కమీషన్లే అని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ పథకం వచ్చిన కొత్తల్లో అంతా ఎమ్మెల్యేల మీదే పెట్టింది ప్రభుత్వం. దీంతో కొందరు.. లబ్ధిదారుల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరును తెచ్చిపెట్టింది. ఒకానొక సమయంలో సీఎం కేసీఆరే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అర్హుల ఎంపిక ప్రక్రియను కలెక్టర్లే చూసుకుంటే బెటర్ అనే వాదన తెరపైకి వచ్చినా.. మళ్లీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి, వారు ఇచ్చిన లిస్టును పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లకు కేసీఆర్ చెప్పారు. అయితే.. ఈ పథకం అంతా ఎన్నికల స్టంటే అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.