గ్రూప్-1 (Group-1) ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్పీఎస్సీ అప్పీల్ కు వెళ్లడంతో హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ (TSPSC) విఫలమవడం ఏంటని ప్రశ్నించింది.
మొదటిసారి పేపర్ లీకేజ్ తో పరీక్ష రద్దు చేశారు.. రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడింది హైకోర్టు. గ్రూప్-1 రీ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటో చెప్పాలని అడిగింది. టీఎస్పీఎస్సీ నుండి ఇన్ స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపగా.. ఏజీ కీలక వాదనలు వినిపించారు.
బయోమెట్రిక్ ఎందుకు పాటించలేదని హైకోర్టు మరోసారి ప్రశ్నించగా.. సాంకేతిక కారణాల వల్లే జరగలేదని వెల్లడించారు. బయోమెట్రిక్ పాటించకపోవడం వల్ల అభ్యర్థులకు నష్టం లేదని.. ఇదొక్కటే కారణంగా చూపించి మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ సందర్భంగా ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్పీఎస్సీపై ఆగ్రహం చేసింది హైకోర్టు. ఒకసారి పేపర్ లీకేజీ, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య ఉందంటూ.. యువత జీవితాలతో ఆడుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. అభ్యర్థుల గురించి ఆలోచించాలని ఏజీ కోర్టును కోరారు.