బీఎస్పీ (BSP) తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar )కు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ (BRS) నేతలపై దాడి కేసులో ఆయన్ని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు ఈ కేసులో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వెలుపడే వరకు ప్రవీణ్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆయనతో పాటు ఆయన కుమారుడిపై కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది.
ఈ నెల 12న కాగజ్‌నగర్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచార సభను నిర్వహించారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ప్రచార రథాలు అటు వైపుగా వచ్చాయి. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు తమ సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతోనే కావాలనే స్పీకర్ల సౌండ్ బాగా పెంచారని బీఎస్సీ నేతలు ఆరోపించారు. దీంతో ఘర్షణ జరిగిందన్నారు.
ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఎస్పీ నేతలు తెలిపారు. సోమవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయిందన్నారు. ఇది ఇలా వుంటే తనతో పాటు తన కుమారుడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్పతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.