ముఖ్యమైన పండగలు వచ్చాయంటే నగరం మొత్తం ఖాళీ అవుతోంది. తాజాగా బతుకమ్మ (Batukamma), దసరా (Dussehra) అంటే రెండు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించుకునే పండగ.. దీంతో ఉద్యోగులు, వలస జీవులు అందరు కూడా తమ స్వంత గ్రామాలకు ప్రయాణం అయ్యారు. ఈ నేపధ్యంలో ప్రయాణికులతో హైదరాబాద్ (Hyderabad)లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు సందడిగా మారాయి.
మరోవైపు తెలంగాణ (Telangana) ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తుంది. అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన ప్రత్యేక బస్సులు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా పండుగల సందర్భంగా ప్రజలు రైళ్లు, బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో నగర రోడ్లు ఖాళీగా, రహదారులు రద్దీగా మారాయి. మరోవైపు ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ఇసుక పోస్తే రాలనంత జనం నిండిపోయారు.
కాగా దసరా సందర్బంగా 143 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 208 ట్రిప్పుల వరకు నడుస్తున్న ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.