తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత విజయం వరించింది. బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ పనిచేసిన ఈ పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పట్టించుకొన్న వారే లేరు. ఒకరకంగా బీఆర్ఎస్ వైఫల్యాలు హస్తాం అధికారంలోకి వచ్చేలా చేసిందనే టాక్ ఉంది. అయితే కాంగ్రెస్ అంటే ఆ పార్టీలో ఉన్న నేతలంతా హిట్లర్ లే అన్న అపవాదు ఉంది. అసలు ఐకమత్యం అనే మాట వినపడదనే విమర్శలు జనాల్లో బలంగా నాటుకుపోయాయి.
ఇలాంటి సమయంలో రేవంత్ (Revanth) వ్యూహమా.. లేక కారుపై విసుగుతో ఉన్న జనం పుణ్యమా.. మొత్తానికి కాంగ్రెస్ (Congress)కు పట్టం కట్టారు.. ఈ క్రెడిట్ అంతా రేవంత్ ఖాతాలోకి వెళ్ళి.. చివరికి సీఎం అయ్యారు.. అయితే ఇంత కాలం అధిష్టానం ఆగ్రహించడం వల్ల కామ్ గా ఉన్న నేతలు.. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ జీవం పోసుకోవడంతో.. తమ షాడోలను బయటకు తెచ్చే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుందని నమ్మిన నేతలు.. తమ వారసులను రాజకీయాల్లో సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలనే ఆలోచనతో ఉన్న సీనియర్ నేతలంతా.. లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులకు లేకపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలనే ఒత్తిడి హైకమాండ్ పై పెంచుతున్నట్లు సమాచారం. పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఢోకా లేదని నమ్మిన నేతలు.. చాలా నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో పోటీ పడుతుండటం కనిపిస్తోంది.
వారిలో నల్లగొండ (Nalgonda) పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కె. జానారెడ్డి తమ వారసుని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ కుమారుడు నాగార్జున సాగర్ నుంచి గెలిచాడు. మరో కుమారుడ్నిఎంపీ చేయాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు.. మరోవైపు ఖమ్మం (Khammam) పార్లమెంటు నియోజకవర్గం, మాంచి కాకమీద ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నియోజకవర్గం నుంచి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం.. జహీరాబాద్ టికెట్‌ను తన కూతురుకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతకాలం నుంచి సైలంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తన భార్య నిర్మల కోసం ప్రయత్నిస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంటు నుంచి తన కుమారుడు గడ్డం వంశీకి టికెట్టు ఇప్పించుకునే విషయంలో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిచినట్లు సమాచారం.
మరోవైపు భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య సైతం క్యూలో ఉన్నారు. అసలే కాంగ్రెస్ కి వారసుల పార్టీ అనే ముద్ర ఉంది. ఈ అపవాదు తొలగించుకొంటే కానీ భవిష్యత్ లో.. నాయకత్వానికి ఢోకా లేకుండా ఉంటుందనే భావనలో క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హైకమాండ్ ఆ దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో వారసులకు టికెట్లు అన్న పాయింట్ ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లితే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..