– తెలంగాణ విమోచనం జరపకపోవడం..
– ఓటు బ్యాంకు రాజకీయమే!
– కావాలనే చరిత్రను కనుమరుగు చేశారు
– నిజాం మెడలు వంచిన పటేల్ కు ధన్యవాదాలు
– విమోచన దినం జరపని వారిని ప్రజలు పట్టించుకోరు
– దేశం విశ్వ గురువు స్థానంలో ఉందన్న అమిత్ షా
– పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఓటు బ్యాంకు రాజకీయం కోసం తెలంగాణ చరిత్రను బావితరాలకు తెలియకుండా చేశారని అన్నారు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah). పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Patel) విగ్రహం వద్ద నివాళులర్పించి.. కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన రామ్జీ గోండు పేరు మీద పోస్టల్ కవర్ ను విడుదల చేశారు. అలాగే, నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ పేరు మీద కూడా పోస్టల్ కవర్ ను రిలీజ్ చేశారు షా.
విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. హైదరాబాద్ (Hyderabad) విమోచనం కోసం పోరాడిన వీరులకు ప్రమాణాలు తెలిపారు. తెలంగాణ (Telangana), కళ్యాణ్ కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవని గుర్తు చేశారు. పటేల్ చొరవ వల్ల విమోచనం కలిగిందన్న ఆయన.. ఆపరేషన్ పోలో పేరిట నిజాం, రజాకార్ల మెడలు వంచారని వివరించారు. తెలంగాణ ముక్తి కోసం పోరాడిన నర్సింహారావు, పండిట్ కేశవ్, ప్రభాకర్, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు తదితరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవానికి 75 ఏండ్లయ్యాయన్నారు అమిత్ షా. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. జీ-20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిశాయని.. విశ్వ గురువు స్థానంలో దేశం నిలిచిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని మండిపడ్డారు. ‘‘చంద్రయాన్ సక్సెస్ అయింది.. చంద్రుడిపై రోవర్ ను ల్యాండ్ చేసిన నాలుగో దేశం మనది. జీ-20.. ఇక ఇప్పుడు జీ-21 అయింది. ఇది దేశానికి పెద్ద అచీవ్ మెంట్’’ అని చెప్పారు.
విమోచన దినోత్సవం చరిత్ర గురించి ఏమాత్రం పట్టింపు లేని వారిని ప్రజలు కూడా పట్టించుకోరని అన్నారు షా. 399 రోజులు రజాకార్లకు బానిసలుగా బతకాల్సి వచ్చిందని ఆనాటి విషయాలను గుర్తు చేశారు. పటేల్ చుక్క రక్తం బొట్టు కారకుండా హైదరాబాద్ విలీనానికి నిజాం అంగీకరించేలా మెడలు వంచారని అన్నారు. ఆయన లేకపోతే విముక్తి లభించేది కాదని చెప్పారు. ఇక, మోడీ పుట్టినరోజు కానుకగా 173 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు అందించారు అమిత్ షా.
మరోవైపు, ఇదే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడారు. తెలంగాణ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్ సమాధి చేసిందని.. భూమి కోసం, భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదన్న ఆయన.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ బాటలోనే బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి.