– కాళేశ్వరం ఖర్చు రూ.95 వేల కోట్లు
– ఆయకట్టు 97 వేల ఎకరాలు
– సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది రూ.80 వేల కోట్లకే
– కానీ, రూ.95 వేల కోట్లుకు తీసుకెళ్లిన కేసీఆర్ ప్రభుత్వం
– రిపేర్లు అయ్యే సరికి రూ.1.50 లక్షల కోట్లు
– అక్టోబర్ 21న కుంగిన మేడిగడ్డ పిల్లర్లు
– ఇప్పటిదాకా నోరెత్తని కేసీఆర్
– కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తాం
– మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించిన మంత్రుల బృందం
– ప్రాజెక్టుపై ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సమగ్ర వివరాలను సేకరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే నలుగురు మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలని సందర్శించింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ముందుగా మేడిగడ్డకు వెళ్లారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను వీక్షించారు.
రెండు టీఎంసీల ప్రాజెక్టు కోసం రూ.94 వేల కోట్లతో ప్రతిపాదన చేశారని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఏడాదిన్నరగా 3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన చేసినట్టు వివరించారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు కింద 98,570 ఎకరాల సాగైందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మించిన తీరుపై మండిపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టులో సమస్య ఏర్పడిందని.. ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఆరోపించారు. మూడేళ్లలో కాళేశ్వరం కుప్పకూలడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు బాధ్యత బిల్డర్లదే అని తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయటపెడతామన్నారు.
పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. మాటలు అదుపులో ఉంచుకోవాలని ఉత్తమ్ సూచించారు. తప్పులు చిన్నవని అంటున్న నాయకులు.. నష్టాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. తాము మొదట ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని తుమ్మడిహెట్టి దగ్గర నిర్మించాలని భావించామని, అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా శంకుస్థాపన చేశారని చెప్పారు. 38 వేల కోట్లు ఖర్చు చేసి 16 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా నీరిందించేందుకు ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారిందని అన్నారు.
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లకు మాత్రమే కేంద్ర జలవనరుల సంఘం అనుమతి ఇచ్చిందని.. దానిని 95 వేల కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని అన్నారు. ప్రస్తుతం రిపేర్లు పూర్తయి మనుగడలోకి వచ్చేందుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ వార్షిక వ్యయం రూ.13 వేల కోట్లు ఉండబోతోందని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంపై అనేక అభ్యంతరాలను ఇటు అసెంబ్లీలో, అటు పార్లమెంటులోనూ తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిలో ప్రకటించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో సైట్ మీద ఒకసారి వాస్తవాలు తెలుసుకుందామని మేడిగడ్డ విజిట్ కోసం వచ్చామని తెలిపారు.