కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎంపీ (MP)లు రాజీనామా (Resign) చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly Elections) ఆయా ఎంపీలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేశారు.
వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలవగా, మరో నలుగురు అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి బీజేపీ తరఫున ఎంపీ బండి సంజయ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు కూడా బీజేపీ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు.
ఇక మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవిని రేవంత్ రెడ్డి అధిష్టించనున్నారు. దీంతో ఈ రోజు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
అటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా తన ఎంపీకి రాజీనామా చేయనున్నారు. సాధారణంగా ఎంపీగానీ, ఎమ్మెల్యే గానీ రాజీనామా చేస్తే కనీసం మరో ఆరు నెలలైనా పదవీ కాలం మిగిలి ఉండాలి. అలాంటి సమయంలోనే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం ఆయా ఎంపీల పదవీ కాలం మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది. దీంతో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.