తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అధికార పార్టీ ఒకవైపు.. అసలు అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు మరోవైపు వాదించుకుంటున్నాయి. మా అభివృద్ధి చూసి ప్రజలు మాకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు..మరి ప్రచారానికి వెళ్ళిన వారికి నిరసనలు ఎందుకు ఎదురవుతున్నాయో..! అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి.
మరోవైపు నిర్మల్ (Nirmal)జిల్లా లోకేశ్వరం (Lokeswaram) మండలంలో ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA)కు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రచారానికి వచ్చిన వీరిని పొలిమెరలో అడ్డుకుని దాదాపు మూడు గంటలకు పైగా రోడ్డుపైనే నిలబెట్టి తిప్పి పంపించారు. తొమ్మిదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించాలని నిలదీశారు. ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి (Vitthal Reddy) అర్హులైన పేదలకు దళిత బంధు, బీసీ బంధు ఇవ్వకుండా అనుచరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వారి సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామస్తులను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఎడ్దూర్, పొట్‌పెల్లి గ్రామస్తులు సహకరించాలని కోరారు. అయినా గ్రామస్తులు శాంతింకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మనలో మన మాట.. ప్రజల కోసం ఆలోచించి.. పనిచేసే నాయకుడు వస్తే హారతులు పట్టి స్వాగతం పలకాలి గాని ఇలా ఎదురు తిరుగుతూ ఉన్నారంటే అర్ధం ఏంటి ? అని కొందరు బుర్ర పగిలేలా ఆలోచిస్తున్నారు..