తెలంగాణ శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elecions) ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అభ్యర్థులు ఎన్నికల నియమాలను ఉల్లంఘించకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా ఉల్లంఘించినట్లు తెలిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తోంది. అధికారులకూ పలు కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల వేళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించని అధికారులపై కఠిన చర్యలకు ఎన్నికల సంఘం వెనుకాడడంలేదు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోయినపల్లి మనోహర్ రావుపై ఎన్నికల సంఘం వేటు వేసింది. సస్పెండ్ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
మనోహర్ వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ వై.సత్యనారాయణనూ ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖ పంపింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మనోహర్‌రావు, సత్యనారాయణతో తిరుమల వెల్లడమే ఇందుకు కారణం.
గత నెల 15, 16వ తేదీల్లో మనోహర్ రావు తిరుమల వెళ్లినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు విచారణ జరిపి నివేదికను సీఈసీకి పంపారు. దీన్ని అధ్యయనం చేసిన సీఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.