కృష్ణా జలాల (Krishna Water) విడుదల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రగడ మొదలైంది. తాజాగా నిన్న అర్దరాత్రి సమయంలో ఏపీ పోలీసులు (AP Police) ప్రాజెక్టుపైకి చేరుకున్నారు. నిన్న గుంటూరు, పల్నాడు జిల్లాలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. అర్థరాత్రి సమయంలో సాగర్ డ్యామ్ వద్దకు వెళ్లిన ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకుంది. దీంతో మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగం గేట్లు తమ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు అన్నారు. సాగర్ ప్రాజెక్టు 13వ గేటు వరకు చేరుకోగా వారిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకుంది. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఏపీ పోలీసులు దాడి చేశారు.
ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి ఏపీ పోలీసులు సెల్ ఫోన్లు లాక్కొన్నారు. దీంతో పాటు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
సమాచారం అందుకున్న మిర్యాల గూడ డీఎస్పీ తన సిబ్బందితో కలిసి డ్యామ్ వద్దకు చేరుకున్నారు. డ్యామ్ నిర్వహణ విషయం అనేది ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని అంశమని తెలిపారు. వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముళ్ల కంచెను తొలగించేందుకు ఏపీ పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు.
ఎన్నికల వేళ ఉద్రిక్తతలపై కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. దీన్ని బీఆర్ఎస్ కుట్రగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే కుట్రతోనే బీఆర్ఎస్ మరో కుట్రకు తెరలేపిందన్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోమటి రెడ్డి సూచించారు.