నాలుగేండ్ల కాలంలో తెలంగాణ (Telangana) ప్రజలు బీజేపీని బలోపేతం చేశారని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతిని కాదు పారదర్శక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అబద్దాల వాగ్దానాలు కాదు క్షేత్రస్థాయి పనులు తెలంగాణకు కావాలన్నారు.
మహబూబ్ నగర్ సభలో పాల్గొని ప్రధాని మోడీ మాట్లాడుతూ….. పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గోవాలని ప్రజలను కోరుతున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. పరిశుభ్రతను ప్రజా ఆందోళనగా మార్చారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి మూలన పరిశుభ్రత ఒక ఉద్యమంలా సాగిందన్నారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. మొత్తం రూ. 13500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టానన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది బీజేపీ ప్రభుత్వం అన్నారు. రాణి రుద్రమ దేవీ లాంటి నాయకురాళ్లు పుట్టిన నేల ఇదని తెలిపారు.
ఈ మధ్యే మనం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకున్నామన్నారు. దీంతో చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఢిల్లీలో ఒక అన్న ఉన్నారనే విషయం తెలంగాణ అక్కా చెళ్లెల్లకు తెలుసన్నారు. మహిళల కోసం లక్షల సంఖ్యలో టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా ముద్ర రుణాలు అందిస్తున్నామన్నారు.
పేదలకు ఇళ్లు, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళల జీవితాన్ని మెరుగు పరిచేందుకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ ఫ్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 2014 వరకు తెలంగాణలో వున్న రహదారుల పొడవు 2500 కిలో మీటర్లు మాత్రమేనన్నారు. ఈ తొమ్మిదేండ్లలో 2500 కిలో మీటర్ల రహదారులు నిర్మించామన్నారు.
అన్నదాతలను తాము గౌరవిస్తున్నామన్నారు. వారి కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని అందిస్తున్నామన్నారు. తెలంగాణ రైతులకు కనిష్ట మద్దతు ధర ద్వారా ఏటా రూ. 27000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 8 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఆ డబ్బు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తోందన్నారు. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోందన్నారు.
కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచమంతటికి తెలిసిందన్నారు. కరోనా తర్వాత పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయన్నారు. అందుకే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.900 కోట్లతో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు. తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు.