గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) కృష్ణమోహనరెడ్డిని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) అనర్హుడిగా ప్రకటిస్తూ…ఆ స్థానంలో డీకే అరుణను ఎమ్మేల్యేగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని పట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన డీకే అరుణ (DK Aruna) కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
హై కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker), సెక్రెటరీని కలిసి అందించేందుకు అసెంబ్లీకి వస్తే, వారిద్దరూ అందుబాటులో లేరని డీకే అరుణ అన్నారు. తాను వస్తున్నానని తెలిసే వారిద్దరూ కావాలనే ఇవాళ అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. నిన్న, ఇవాళ కూడా తాను స్పీకర్ కు ఫోన్ చేశానని, కానీ తన కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని డీకే అరుణ అన్నారు. రోజూ ఉదయం 10 గంటలకే అసెంబ్లీ కార్యాలయానికి వచ్చే సెక్రెటరీ కూడా ఇవాళ రాకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో అందచేశానని తెలిపారు.
తనని ఎమ్మేల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డరుని వెంటనే అమలు చేసే విధంగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కోర్టు తీర్పును గౌరవించాలని తెలిపారు. ఈ తీర్పు కొంత కాలం ముందు వచ్చి ఉంటే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తనకు కలిగేదన్నారు. ఏది ఏమైనా తీర్పు వచ్చింది కాబట్టి…ఇప్పటికైనా దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
“డీకే అరుణకు అనుకూలంగా హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ కార్యాలయం వెంటనే నిర్ణయం తీసుకోవాలి” అని డీకే అరుణలో పాటు అసెంబ్లీకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.
అసెంబ్లీ నుంచి తెలంగాణా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను కలిసేందుకు డీకే అరుణ, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి వెళ్లారు. అక్కడ ఆయన్ని కలిసి హైకోర్టు తీర్పు కాపీతో తనని గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన వికాస్ రాజ్…త్వరలోనే సమాచారం ఇస్తామని తెలిపారని డీకే అరుణ చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేస్తారని నమ్మకం తనకు ఉందని
ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.