రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటిపూట బడులపై షెడ్యూల్ విడుదల చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 15 నుంచి అకాడమిక్ ఇయర్ ముగిసే వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యాశాఖ పేర్కొంది.
అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీరికి తొలుత మధ్యాహ్నభోజనం అందించి ఆ తర్వాత క్లాసులు నిర్వహించనున్నారు.
కాగా ఒంటిపూట బడులు అనంతరం పిల్లలు ఇళ్లకు వెళ్లి.. ఎండలో ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మరో రెండు నెలలు ఎండలు దంచికొట్టే అవకాశం ఉన్నందున పిల్లలు నీడపట్టునే ఉండాలన్నారు.