తెలంగాణ(Telangana)లో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు(Temperature) క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దేశంలోకెల్లా తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పదేళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే రెడ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేయగా ఉదయం 11 నుంచి 4గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
కొత్తగూడెంలో గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇది దేశంలోనే అత్యధికమని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగించే విషయం. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, యాదాద్రి, వనపర్తి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 45 డిగ్రీల ఎండ దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అచ్చన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పని చేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
మంచిర్యాల, మెదక్, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, భూపాలపల్లి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో శనివారం తీవ్రమైన వడగాలులు వీచాయి. మరోవైవు దక్షిణ మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడడంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.