ఇటీవల కాలంలో ఉగ్రవాదులు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు దాడి చేస్తామంటూ సమయం, ప్రాంతం చెప్పీమరీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవల ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
తాజాగా, భారత పార్లమెంటుపై(India Parliament) దాడి చేస్తామని మరో బెదిరింపు వీడియోను విడుదల చేయడం కలకలం రేపింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తనను చంపడానికి భారత ఏజెన్సీలు పని చేశాయని, వారి కుట్రలు విఫలమయ్యాయని చెప్పాడు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపాడు.
అందులో డిసెంబర్ 13లోపు భారత పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి జరగగా 22 ఏళ్లు గడిచింది. దీనిని ఉదహరిస్తూ పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురుని వీడియోలో చూపిస్తూ ఢిల్లీ బనేగా ఖలిస్తాన్(Khalistan Terrorist) అనే శీర్షికతో పోస్టర్ ను ప్రదర్శించాడు.
అందులో ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుందని హెచ్చరించాడు. అయితే, పన్నూన్‌ను హతమార్చడానికి అమెరికాలో కొందరు ప్రయత్నించారని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అతను భారత్‌లో నిషేధించిన యూఎస్ ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్(SFJ) చీఫ్‌గా ఉన్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు లిస్టులో సైతం ఉన్నాడు.
పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా డిసెంబర్ 22న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటుపై దాడి చేస్తామని పన్నూన్ బెదిరింపు వీడియో బయటపడడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పన్నూన్ వెనక పాకిస్థాన్‌కి చెందిన ఐఎస్ఐ సంస్థ ఉన్నట్లు భారత అధికారులు భావిస్తున్నారు.