అగ్రరాజ్యం అమెరికా(USA)లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ హూస్టన్(Houston, Texas)లోని మెగాచర్చిలో ఆదివారం ఓ మహిళ తుపాకీతో కాల్పుల(Gunshots)కు పాల్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, 57 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో ఓ మహిళ లాకుడ్ చర్చి(Lockwood Church)లోకి ప్రవేశించింది. ట్రెంచ్కోట్ ధరించి ఉన్న ఆమె పొడవాటి తుపాకీని తీసి ప్రార్థనలు చేస్తున్న వారిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడింది. దీంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.
అక్కడ ఉన్న ఇద్దరు భద్రతా పోలీసులు ఎదురు కాల్పులు జరపటంతో ఆ మహిళ మృతిచెందింది. ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో 57ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు. బాలుడు పిల్లల ఆసుపత్రిలో ఉన్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ తెలిపారు. మరో వ్యక్తి తుంటి గాయంతో వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
కాల్పులు జరిపిన మహిళ ఎవరనేది తెలియాల్సివుంది. మహిళతో ఆ బాలుడికి సంబంధమేంటి, బాలుడిపై ఎందుకు కాల్పులు జరిపిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమరం చేశారు. ఈ యూఎస్లోనే మూడో అతిపెద్దదిగా మెగాచర్చ్ పేరొందింది. ప్రతీ వారం 45వేల మంది ప్రార్థనల్లో పాల్గొంటారు. 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగుంటే దారుణంగా ఉండేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.