రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ (BRS) పాలనలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై చర్చ జరుపుతోన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం (Kaleswaram) అవినీతి పై జోరుగా చర్చలు సాగుతోన్న క్రమంలో.. బీఆర్ఎస్ అవినీతిపై రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు..
ప్రభుత్వ విభాగాలు అన్ని, నష్టాల్లో వున్నాయని తెలిపిన వెంకటరెడ్డి.. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరా పంట పండిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఫామ్ హౌజ్ కి మాత్రమే ప్రయోజనం కలిగిందని వెల్లడించారు. పిట్టల దొరలా గొప్పలు చెప్పుకొనే కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో రోడ్లు అన్ని మంత్రి తుమ్మల కవర్ చేశారని.. ఇంకా మిగిలిన వున్న వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు అమల్లోకి తెచ్చేందుకు రివ్యూ జరుగుతోందని తెలిపిన వెంకటరెడ్డి.. హామీలు ఎదో తూ తూ మంత్రంగా కాకుండా పకడ్బందీగా అమలు చేసేలా పని చేస్తున్నామని వివరించారు.. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ అల్లకల్లోలంగా మారిందని ఆరోపించిన వెంకటరెడ్డి.. ఏ శాఖలో చూసిన వేల కోట్లలో అప్పులు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచనలతో ప్రభుత్వం ముందుకి వెళ్తుందని పేర్కొన్నారు..
కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకొన్న గత ప్రభుత్వం.. కమీషన్ కోసం హడావిడిగా ప్రారంభించి రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా చేశారని వెంకటరెడ్డి మండిపడ్డారు..కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గొప్పలకి వెళ్ళి.. నేనే ఇంజినీర్ అని ప్రాజెక్ట్ ని నిండా ముంచాడని వెంకటరెడ్డి అన్నారు.. కాళేశ్వరం నిర్మాణం తీరు రాష్ట్ర పరువుతీసేలా ఉందని వెంకటరెడ్డి మండిపడ్డారు.. కేసీఆర్ ఘనతలు మాకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు..