తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు (Contract Lecturers) ఆందోళనకు దిగారు. గత రెండు వారాలుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. స్వ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) హామీ ఇచ్చారని కాంట్రాక్టు లెక్చరర్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 వర్శిటీల్లో పనిచేస్తున్న 14 వందల మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెర వేర్చలేదన్నారు. ఇప్పటికైనా తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళనకు దిగారు. ఈ నెల 4 నుంచి తాము ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వర్శిటీ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా అసిస్టెంట్ ఫ్రొపెసర్ లను పోలీసులు అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేసి వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. గత 30 ఏండ్లుగా తాము విద్యా బోధన చేస్తున్నామని, ఎంతో మంది నిరుపేదలకు విద్యను అందచేస్తున్నామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామన్నారు.